Monday, April 13, 2020

వైద్యుడికి నీరాజనం

కనపడలేదా కరోనా కాఠిన్యం
కళ్లు తెరిచి చూడు, నీ కళ్ల ముందే కదులుతూ కనపడుతుంది
కన్న పిల్లల్ని వదిలేసి
కట్టుకున్న వాళ్లని కాదని
కన్నీళ్లు ధారలా కారుతున్నా
కర్తవ్యం కోసం కరుడుకట్టిన వైద్య బృందం 

కరోనా బాధితులే తమ బంధువులని
కరోనా అంతమే తమ బాధ్యత అని
కళ్లలో వత్తులేసుకున్న తమ కుటుంబాలకన్నా
కళ్ల ముందు బాధపడుతున్న వారే ముఖ్యమని
కంటి మీద కునుకు లేక
కడుపుకింత కూడు లేక
కరోనా మనకంటకుండా
కంచెలా తమ ప్రాణాల్ని అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు

కంటకాలు దారిలో తగిలినా
కరోనా మహమ్మారి సోకినా
కన్న ప్రేమ కన్నా వృత్తికే విలువనిచ్చారు
కనుక వాళ్ల కాళ్లకి మొక్కినా ఋణం తీర్చుకోలేము
కనీసం మన వంతు బాధ్యతనైనా నిర్వర్తిద్దాం
కదలకుడా ఇంట్లోనే ఉందాం

కరోనాతో యుద్ధంలో వారికి భారం అవ్వకుండా ఉందాం
కదనంలో ఈసారి కాలు బయట పెట్టకుండా వారి సేవకి సలామందాం
కలనైనా చూడని కరోనా మహమ్మారి కొసం శ్రమించే వారి పనిని గౌరవిద్దాం
కవితాంజలి నా కలం పలుకుతోంది వైద్యులారా
కరుగుతూ కొవ్వొత్తిలా వెలిగిస్తున్నారు మా ప్రాణాల్ని
కనుకనే అందుకోండి మా పాదాభివందనాల్ని

తమ ఇల్లు వాకిలి,కట్టుకున్న వారు, కన్న వారు, వారు కన్న వారు అందర్ని వదిలేసి, ప్రాణాల్ని త్యజించి మన కోసం పోరాడుతున్న వైద్య బృందానికి నీరాజనం పడుతూ

శ్వేతపుష్పం

No comments:

Post a Comment